Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభేదాలున్నా... ప్రభుత్వాలుగా ముందుకెళదాం: తెలంగాణ సర్కారుకు చంద్రబాబు పిలుపు

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు పొడచూపాయి. విద్యుత్ పంపిణీ, విద్యుదుత్పత్తి, నీటి వాటాలు, ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల విషయంలో ఈ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిద్దాం రండి అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు. రాజకీయంగా విభేదించినా, ప్రభుత్వాలుగా ముందుకెళదామంటూ ఆయన చేసిన ప్రతిపాదన ఇరు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసింది. రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా, 9,10 వ షెడ్యూల్ కేటగిరీ సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని, ఈ సంస్థల విభజన కోసం కలిసి కూర్చుని చర్చించుకుందామంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇరువురి మధ్య విభేదాలు వస్తే, ఇద్దరికీ నచ్చిన పెద్ద మనిషిని మధ్యవర్తిగా పెట్టుకుందామని ఆయన పేర్కొన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుందామని చెప్పారు. మరి చంద్రబాబు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ మేరకు స్పందిస్తారో చూడాల్సి ఉంది.

More Telugu News